Skip to main content

సొంతం



సొంతం 
ఒంటరితనంతో,
ఆకాశాన్నంటే సౌధాలలో ఉంటూ,
నిశీధిలో శూన్యం చూస్తూ,
నిశరాత్రిలో నిశ్శబ్దం వింటూ,
చుట్టూ ఉన్న చీకట్లను కళ్ళల్లో దాచుకుంటూ,
నీ భయాలు, సంశయాలు ఎదుర్కుంటూ,
అడగని ప్రశ్నలకి జవాబు అన్వేషిస్తూ,
దొరకని జవాబుని పదేపదే ప్రశ్నిస్తూ,
గడచిన రోజుని నెమరవేసుకుంటూ,
పడుకుంటూ.. తరచూ మేలుకుంటూ.. 
రాజీ పడని  రోజు రేపొస్తుందనుకుంటూ 
ఆశగా నీవు ప్రతిరోజు గడుపుతావు. 
కలలో ఆశలు నెరవేరడం సహజం, 
ఆశలు కలగా మిగిలిపోవడం నిజం.. 
నీ ప్రయత్నం లోపించిందా అని ప్రశ్నించక,
ఓటమిని సహించక, నిజాన్ని గ్రహించక, 
సమయం లేదని సమర్దించుకుంటూ 
ఇవ్వాళ కుదరదు 'బిజీ' అనుకుంటూ 
'తరువాత చూద్దాం.. సర్లే చేద్దాం'
అని నీతో నువ్వు రాజీ పడిపోకు... 
కష్టం అనుకుంటే
నీ ఇష్టాన్ని వదులుకో,
శ్రమ అనుకుంటే
నీ భ్రమ తొలగించుకో 
అసలేం కావాలో అది నిర్ణయించుకో !
నిలకడ లేని నీ మనసుకి,
మనుగడ గురించి అంత ఆలోచన దేనికి?
మనసుంటే మార్గం ఉంటుంది మిత్రమా,
ప్రయత్నించు..
పోరాడితే పోయిందేముంది ?
మనసు మనసుకి దూరాలు 
మనిషి మనిషికి విభేదాలు 
'ఎలా ఉన్నావు' అని అడిగే చిరునవ్వు 
కనుమరుగయ్యిందని గుర్తించు నువ్వు. 
బలహీనుడ్ని లూటి చేసి,
ప్రపంచం అది పోటి అంటుంది. 
నీ ప్రమేయం లేకుండా పరిగెత్తిస్తుంది
పోటి ప్రవాహంలో నిన్ను ముంచేస్తుంది 
నీ ఆశను, ఆశయాన్ని నిర్దేశిస్తుంది.
నువ్వు గెలిస్తే నీ వెంటొస్తుంది 
నువ్వోడితే 'ఓస్.. ఇంతే' అంటుంది 
వందల మందలో నిన్ను ఒంటరి చేస్తుంది. 
మరి నలుగురి మెప్పుకోసం ఈ తపన దేనికి?
గెలవడమంటే కేవలం గుంపులో నడవడమా? 
లేదా నీ దారిలో గమ్యానికి చేరి ఉనికి చాటడమా?
జీవించడం అంటే స్వేచ్చని పాటించమని మంత్రం 
నీ తప్పు,
నీ ఒప్పు,
 నీ పంతం,
నీ సొంతం. 
………… కళ్లే వెంకటేశ్వర శాస్త్రి

Comments

Popular posts from this blog

           లక్ష్యం నేను ఎదో చెప్పాలి వికసించిన పూవులా రెక్కలు విదిలించిన పక్షిలా చిరునవ్వును ఇష్టపడి నట్టే అయితే ఏం చెప్పాలో గుర్తు రావటం లేదు. వెదుకుతున్నా పొగొట్టు కొన్నదేమో తెలియకుండా నీ జ్ఞాపకాల ఒడిలో మరచినట్టున్న అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నజ్ఞాపకాల కలలు నిరుత్సాహం వెనకనే ఆశలు నక్షత్రాల వలే మినుకు మినుకు మంటున్నాయి సాగుతుంది జీవనయానం తీరం దూరంగా కనిపిస్తూన్నా నడుస్తున్నకొద్ది ముందుకెళుతూంది జ్ఞాపకాల సుమాలు పరచుకున్న బాటలో జీవించాలి ఈ అనంత జీవన ఝరిలో పుట్టుక చావు రెండు తీరాలు మధ్యలో జీవనపథం ఆరంభానికి అంత్యానికి మధ్య జీవితం పూలు ముళ్ళు లక్ష్యం మనవైపు వెలుతు కోపగించుకున్నా చీకటి మింగేస్తున్నా చిరునవ్వు జయిస్తుంది.

తిరిగొచ్చిన కవిత

ఓ కవిత నన్ను గుర్తు చేసుకోమని   అడిగితే నేను   మాట్లాడక   ఊరుకుంటే ముఖం మాడ్చుకొని   వెళ్ళిపోయింది మరచి పోయిన   గతం లోకి జ్ఞాపకాల దొంతరలో   ఆ కవిత కోసం వెదకడం   ప్రారంభించాక   ఎదురుపడింది ఓ అర్ధరాత్రి   ముసలిదై   వణుకుతూ   మూల్గుతూ పొరపాటయిందని   గుండెగదిలో వెదికాను   గతస్మృతుల కోసం ముసలిదైన   కవిత మళ్ళా రమ్మంది దగ్గరకెళ్ళి   మన్నించమని   అడిగాను నా అభ్యర్థనను మన్నించి మరలా అరుణ పుంజంలా నా ముందు నిల్చింది నా గతం గుర్తుకొచ్చింది నీవు చెబితే   నేను   వ్రాసుకొంటానన్నాను తను చెప్పింది నేను వ్రాసా..... కె.వి.శాస్త్రి