సంయమనం
ఆమధ్య
మాఊరికి వెళ్ళొచ్చాను
ఏప్పుడో సిమెంటురోడ్డు ఉండేది
అనిపించే ఆనవాళ్ళున్నాయి
పెంకులు పగిలిన ఇళ్ళూ
పక్షుల రెట్టలతో కలావిహీనమయిన
రామాలయపు గోపుర శిఖరాలు
బోర్డుకే పరిమిత మయిన వ్యాయమశాల
అశ్వర్థకట్ట
పైన నాలుగైదుగురు ముసలివాళ్ళూ
గుడి యెదురుగా శీనయ్య కోట్లో
షాంపూల గుట్కాల హారాలు
రకరకాల సిం కార్డుల బోర్డులు
మినరల్ వాటర్ బాటిల్స్,
పెప్సీలు,కోలాలు
గాయత్రి మంత్రాన్ని మరచిన
పూజారి గారి అబ్బాయి
ఇంటి వసారాలో సిగరెట్టు
కాలుస్తున్నాడు
ఒకప్పుడు అందరి భూముల వివరాలు
ఖచ్చితంగా తెలిపే
కరణంగారి అబ్బాయి
బినామి పేర్లతో
రియల్ ఎస్టేట్ బిజినెస్
చేస్తున్నాడు
ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరో
అమెరికాలో నో యుకే లోనో
ఉన్నారు
వాళ్ళతో మాట్లాడ్డానికి
ప్రతి ఇంట్లో
ఇంటర్నెట్లు లాప్ టాపులు
జాత్రలు,తిరునాళ్ళు,తప్పెట్లు,
బాకాలు
రాజకీయ మీటింగులకే పరిమితమయ్యాళ్ళాయి
పొలాల వైపు వెళ్ళేవారే లేరు
యేముందని వెళ్ళాలని అంటారు
పంట పెట్టడానికి నీళ్ళు
లేవంటారు
కరెంటులేదంటారు
భూములు అమ్మకానికి పెట్టారు
ఊర్లో ఉండే వారే లేరు
పనిఉన్నా లేకపొయినా
ప్రతి రోజూ పట్నానికి వెళ్ళిరావాలి
బస్సుల్ల కోసం ఎవరూ ఎదురు
చూడరు
ఆటో లు ఎప్పుడూ దొరుకుతాయి
కష్ట పడే నైజం ఎవ్వరిలోనులేదు
ఈజీ మనీకి దాదాపు అందరు
అలవాటు పడిపొయ్యారు
ఎందుకో మనసు అదోలా అయిపోయింది
మారని ఊరిలో
మారిన మనుషుల మధ్య
ఉండలేక వచ్చేసాను
………………కళ్ళే శాస్త్రి
Comments
Post a Comment